📅 Saturday, 14 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
‹
›
District News

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా
  • నవంబర్19 న గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు అర్హులైన కుటుంబాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ నవంబర్ 14 సాక్షర ప్రతినిధి
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కుటుంబానికి జీవనాధారమైన ప్రధాన సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా పరిహారం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని తెలిపారు.ఈ పథకం కింద కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడికి బీమా రక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని, వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారని వివరించారు.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ శిబిరాల్లో అర్హులైన కుటుంబాలను గుర్తించి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, బీమా పొందే ప్రధాన సభ్యుడి వివరాలు, నామినీ వివరాలతో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
నమోదు సమయంలో వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని, నామినీ మైనర్ అయితే వారి సంరక్షకుడి వివరాలను కూడా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సేకరించిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో నమోదు చేసి, సంబంధిత బీమా సంస్థకు పంపించడంతో పాటు అసలు దరఖాస్తులను జిల్లా స్థాయిలో భద్రపరచనున్నట్లు తెలిపారు.బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో సంబంధిత అధికారుల ద్వారా వివరాలను నమోదు చేసి, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం జిల్లా స్థాయి ఆమోదంతో బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తారని కలెక్టర్ వివరించారు. అర్హత నిర్ధారణ పూర్తయిన తర్వాత రూ.5 లక్షల బీమా పరిహారాన్ని నామినీ బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ బీమా భద్రతపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఒక్క కుటుంబం కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కావున అర్హులైన కుటుంబాలు ఈ నెల 19న నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలకు అవసరమైన వివరాలతో హాజరై ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా విజ్ఞప్తి చేశారు.