- ఓటు బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఢిల్లీకి తరలిరావాలి: కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు
నిర్మల్, అక్టోబర్ 27 (సాక్షర ప్రతినిధి):ఓటు బచావో.. దేశ్ బచావో’ నినాదంతో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్న నాయకులతో కలిసి ప్రత్యేక బస్సును శ్రీహరిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్, మాజీ ఏఎంసీ చైర్మన్ దశరథ రాజేశ్వర్, నాయకులు నాందేడపు చిన్ను, ఓస రాజేశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, సోన్ మండల మాజీ అధ్యక్షుడు ఎన్ మధుకర్ రెడ్డి, సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer