📅 Tuesday, 27 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర
‹
›
District News

జాతీయ స్థాయి వూషూ పోటీలకు నిర్మల్ క్రీడాకారుల ఎంపిక

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
జాతీయ స్థాయి వూషూ పోటీలకు నిర్మల్ క్రీడాకారుల ఎంపిక
  • రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన క్రీడాకారులు ఖేలో ఇండియా క్రీడాకారులకు క్రీడా కిట్లు పంపిణీ చేసిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, అక్టోబర్ 27 (సాక్షర ప్రతినిధి):రాష్ట్రస్థాయి వూషూ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నిర్మల్ జిల్లా క్రీడాకారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అభినందించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో క్రీడాకారులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే జిల్లా ఖేలో ఇండియా శిక్షణ కేంద్రంలోని క్రీడాకారులకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని సూచించారు. నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాల పంట
ఈ నెల 24, 25 తేదీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమెచ్యూర్ వూషూ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగో సీనియర్ రాష్ట్రస్థాయి వూషూ క్రీడా పోటీల్లో నిర్మల్ జిల్లా ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం క్రీడాకారులు సత్తా చాటారు. రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఖేలో ఇండియా శిక్షణ కేంద్రానికి చెందిన మృణాళిని వింగ్ చున్ విభాగంలో బంగారు పతకం, ఫ్లెక్సిబుల్ వెపన్ విభాగంలో రజత పతకం సాధించింది. జ్ఞానతేజ 60 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. వీరిద్దరూ డిసెంబర్ 9 నుంచి 15 వరకు అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జరగనున్న 35వ జాతీయ స్థాయి వూషూ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు.
జాతీయ పోటీలకు మరో ముగ్గురు క్రీడాకారులు
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు తమిళనాడులోని చెన్నైలో జరగనున్న 25వ జాతీయ స్థాయి వూషూ క్రీడా పోటీల్లో నిర్మల్ జిల్లా ఖేలో ఇండియా శిక్షణ కేంద్రానికి చెందిన మరో ముగ్గురు క్రీడాకారులు పాల్గొననున్నారు. గోర అనన్య తైజీజియన్ విభాగంలో, నార్వాడే ఆయుష్ 45 కేజీల విభాగంలో, సల్ల రామ్ చరణ్ 56 కేజీల విభాగంలో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సాధిస్తున్న విజయాలు ఇతర యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఖేలో ఇండియా వూషూ శిక్షకులు శ్రీరాముల సాయికృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.