66 మంది పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
- రూ.66.07 లక్షల విలువైన చెక్కులు అందజేసిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత,నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పెన్షనర్స్ భవన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల్ పట్టణానికి చెందిన 50 మంది,నిర్మల్ గ్రామీణ మండలానికి చెందిన 16 మంది కలిపి మొత్తం 66 మంది లబ్ధిదారులకు రూ.66,07,656 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో తోడ్పాటునందిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, బీజేపీ నాయకులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
