నిర్మల్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు
- వాహనాల రద్దీ నియంత్రణపై ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రత్యేక దృష్టి – రోడ్ల ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలకు ఆదేశం
నిర్మల్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించి, ట్రాఫిక్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా సోమవారం ట్రైనీ డీఎస్పీలతో కలిసి నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు, బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బస్టాండ్ వద్ద వాహనాల రాకపోకలు, ఆటోల నిలుపుదల, రోడ్లపై దుకాణాల నిర్వహణ, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ప్రధాన కూడళ్లు, బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో నిరంతరం అందుబాటులో ఉండి ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఆదేశించారు. రహదారులపై ఆక్రమణలు లేకుండా చూడటంతో పాటు, వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు కూడా తమ వంతు బాధ్యతగా నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు. రోడ్లపై వాహనాలను ఇష్టానుసారంగా నిలపకుండా, రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నిర్మల్ పట్టణంలో సురక్షితమైన, సులభమైన ప్రయాణానికి ట్రాఫిక్ నియమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీలు గజారే సంగీత, ధారావత్ చందన, పతి సందీప్ కుమార్, నిర్మల్ టౌన్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, ఎస్ఐ సిద్ధార్థ, ఆర్ఎస్ఐ రవికుమార్, ఇతర పోలీస్ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
