ఎస్.సి., ఎస్.టి.ల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడంతో పాటు వారి సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలోషెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్.సి., ఎస్.టి. అఘాయిత్యాల నిరోధక జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశానికి డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ఎ.సి.పి.లు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి. లపై అఘాయిత్యాల నిరోధక చట్టం-1989, సవరణ చట్టం-2015 నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. అఘాయిత్యాలకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని, విచారణను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నమోదైన కేసులలో బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం మంజూరు చేయాలని, పరిహారం చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన న్యాయ సహాయం, వైద్య సహాయం, భద్రత, పునరావాస సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఎస్.సి., ఎస్.టి. వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రతి శాఖలో నియమితులైన లైజనింగ్ అధికారులు కీలక బాధ్యత నిర్వహించాలని తెలిపారు. ఆయా శాఖలలో పని చేస్తున్న ఎస్.సి., ఎస్.టి. ఉద్యోగుల సర్వీస్ సంబంధిత సమస్యలు, పదోన్నతులు, సీనియారిటీ, బదిలీలు, ఖాళీల భర్తీ, రిజర్వేషన్ల అమలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలను గుర్తించి సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం పరిష్కారమయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి శాఖలో ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్ల అమలు తీరును సమీక్షిస్తూ, ఉద్యోగుల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కరించిన సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు నివేదించాలని లైజనింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్.సి., ఎస్.టి. లకు సంబంధించిన భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. భూముల హక్కులు, భూ రికార్డులు, ఆక్రమణలు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్.సి., ఎస్.టి. కాలనీలు, ఆవాస ప్రాంతాలలో రహదారుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అవసరమైన చోట సి.సి. రోడ్లు నిర్మించాలని, ఇప్పటికే ఉన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. కాలనీలలో మురుగునీటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, పెండింగ్లో ఉన్న డ్రైనేజీ పనులను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఎస్.సి., ఎస్.టి. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించాలని, త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్, భోజనం, పడకలు తదితర సౌకర్యాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వసతి గృహాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. వసతి గృహాల పరిసరాలలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు భంగం కలిగించే విధంగా వైన్ షాపులు, పాన్ డబ్బాలు ఏర్పాటు కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఉన్న దుకాణాల విషయంలో నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని, వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని తెలిపారు. ఎస్.సి., ఎస్.టి. వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఎస్.సి., ఎస్.టి. వర్గాల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి., ఎస్.టి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దమ్మ నారాయణ, చిలుక రాజనర్సు, బెక్కం రాజారావు, దుర్గం ఎల్లయ్య, పెద్ది రాజన్న, పోలీసు, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, రహదారులు & భవనాల శాఖల అధికారులు, వివిధ శాఖల లైజనింగ్ అధికారులు, జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
