📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

జాతీయ స్థాయిలో ఆర్జీయూకేటీ బాసర విద్యార్థుల ప్రతిభ

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
జాతీయ స్థాయిలో ఆర్జీయూకేటీ బాసర విద్యార్థుల ప్రతిభ
  • ఎలక్ట్రిక్ రేసింగ్ బైక్ పోటీలో టీమ్ వేగా కు ఆల్ ఇండియా 7వ ర్యాంకు.. విద్యార్థులను అభినందించిన ఉపకులపతి ప్రొ. ఏ. గోవర్ధన్
నిర్మల్ నవంబర్ 23 సాక్షర ప్రతినిధి
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసర విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన ‘టీమ్ వేగా’ (Team Vega) విద్యార్థులు జాతీయ స్థాయి ఎలక్ట్రిక్ రేసింగ్ బైక్ పోటీలో ఆల్ ఇండియా 7వ ర్యాంకు (AIR 7) సాధించి విశ్వవిద్యాలయానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఫ్రెటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ (FMAE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా పలు ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీలో ఆర్జీయూకేటీ బాసరకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విద్యార్థులు స్వయంగా రూపొందించి తయారుచేసిన ఎలక్ట్రిక్ రేసింగ్ మోటార్‌సైకిల్‌తో పోటీలో పాల్గొని ఏడో స్థానాన్ని సాధించారు.
పరిమిత వనరులతో వినూత్న ఆవిష్కరణ...........ఈ విజయం వెనుక విద్యార్థుల కృషి, పట్టుదల, సాంకేతిక నైపుణ్యం దాగి ఉన్నాయి. రేసింగ్ బైక్ తయారీలో మోటార్ ఎంపిక, బ్యాటరీ ప్యాక్ నిర్మాణం, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోలర్ అనుసంధానం, వైరింగ్, ఛాసిస్ డిజైన్ తదితర కీలక పనులను విద్యార్థులే స్వయంగా చేపట్టారు. పరిమిత బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులు, విడిభాగాల సమీకరణలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
విద్యార్థులను అభినందించిన ఉపకులపతి...........టీమ్ వేగా సాధించిన విజయంపై విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. ఏ. గోవర్ధన్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు పరిమిత వనరులతో వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. కేవలం తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ ప్రాజెక్టులు, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించడం ద్వారా విద్యార్థులు నైపుణ్యవంతమైన ఇంజినీర్లుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని నూతన ప్రయోగాలు చేపట్టి అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చే విద్యార్థులకు విశ్వవిద్యాలయం తరఫున పూర్తి సహకారం, ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు.విద్యార్థులకు నిరంతరం మార్గదర్శకత్వం అందించిన ఈఈఈ విభాగాధిపతి డా. భావ్ సింగ్, అధ్యాపకులు డా. ఎన్. రాకేశ్, వి. వినయ్ కుమార్‌లను కూడా ఉపకులపతి ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఎలక్ట్రిక్ వాహన పరిశోధనలే భవిష్యత్ లక్ష్యం.........ఈ పోటీ ద్వారా ప్రాక్టికల్ ఇంజినీరింగ్, టీమ్‌వర్క్, సమస్యల పరిష్కారం, ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత, మోటార్‌స్పోర్ట్స్ రంగాల్లో విలువైన అనుభవాన్ని పొందినట్లు విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో ఆర్జీయూకేటీ బాసరలో ఎలక్ట్రిక్ వాహన పరిశోధనలు, మోటార్‌స్పోర్ట్స్, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.తమ విజయానికి ప్రోత్సాహం అందించిన ఉపకులపతి ప్రొ. ఏ. గోవర్ధన్, ఓఎస్డీ ప్రొ. మురళీ దర్శన్, విశ్వవిద్యాలయ యాజమాన్యం, అధ్యాపకులు, ఫ్యాకల్టీ అడ్వైజర్లు, స్పాన్సర్లకు టీమ్ వేగా విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థుల ఈ విజయం ఆర్జీయూకేటీ బాసరలో సాంకేతిక విద్య,పరిశోధన,ఆవిష్కరణలకు ఉన్న అవకాశాలను చాటిచెప్పడంతో పాటు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది.