📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

నిర్మల్ నియోజకవర్గానికి సంక్షేమం, అభివృద్ధి వరాలు.. రూ.58.34 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్ నియోజకవర్గానికి సంక్షేమం, అభివృద్ధి వరాలు.. రూ.58.34 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
  • అభివృద్ధి పనులకు రూ.1.22 కోట్లకు పైగా నిధులు మంజూరు,పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది కూచాడి శ్రీహరి రావు
నిర్మల్ నవంబర్ 17 సాక్షర ప్రతినిధి
పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. మంగళవారం నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు 58,34,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గంలో మౌలిక వసతులు, సాగునీటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.22 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌పై కూలిపోయిన వంతెన పునర్నిర్మాణానికి రూ.66 లక్షలు, రాచాపూర్ కెనాల్‌పై సూపర్ ప్యాసేజ్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.39.40 లక్షలు, నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ.17.20 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ పనులు పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు రైతులకు సాగునీటి అవసరాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని శ్రీహరిరావు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్‌సీ రమేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీంరెడ్డి, అబ్దుల్ హాది, డీసీసీ ప్రధాన కార్యదర్శి గాజుల రవికుమార్, లక్ష్మణచాంద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండ్ర నరేష్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.