నేడు కార్తీక సోమవారం శివనామస్మరణతో మారుమోగానున్న శివాలయాలు
- శ్రీ నీలకంటేశ్వర ఆలయానికి నేడు భక్తుల తాకిడి
నిజామాబాద్ ప్రతినిధి సాక్షర నవంబరు 16, నేడు సోమవారం మొదటి కార్తీక సోమవారం కావడంతో నిజామాబాద్ నగరంలోని చారిత్రక శ్రీ నీలకంఠ శివాలయం భక్తుల రాకతో దీపారాధన తో సందడిగా మారుతుంది. అలాగే శంభుని గుడిలో కూడా భక్తులతో దీపారాధనలతో కిటకిటలాడుతుంది.
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. హిందూ సంప్రదాయంలో ప్రత్యేకంగా శివుడు, విష్ణుమూర్తిని ఆరాధించే మాసంగా పేర్కొంటారు. కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. ఈనెల 21 శనివారం క్షీరాబ్ధి ద్వాదశి జరుపుకుంటారు. 23న రెండో కార్తీక సోమవారం వస్తుంది. నవంబరు 24, మంగళవారం కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజున ఇళ్లలో, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. కొన్ని ఆలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. అంతెగాక ఈ నెలను పవిత్రమైన కాలంగా భావిస్తారు. తెలుగువారి పంచాంగం ప్రకారం కార్తీక మాసం ఈ నెలలో మహిళలు పిల్లా పాపలు అనే తేడా లేకుండ ఎంతో సంప్రదాయబద్ధంగా భక్తి భావంతో తెల్లవారుజాముననే నిద్రలేచి నదుల్లో పవిత్ర స్నానాలు చేయడం, శివాలయాలను దర్శించడం, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ఆ నీలకంఠుని దర్శించుకుని పూలు పత్రాలు బిల్వర్చనలు చేయడం ఆచరించడం పరిపాటి. అంతేగాక నెల రోజుల పాటు భక్తులు మాంసాహారానికి దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. భక్తులు కొందరు కార్తీక సోమవారాల్లో ఉపవాసం పాటిస్తారు. ఈ నెలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో నాగుల చవితి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు ప్రత్యేకం. శుక్రవారం నాగుల చవితి రోజున నాగదేవతను పూజించడం ఆనవాయితీ. శివనామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
365 వత్తులతో దీపం వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. నవంబరు 30న మూడో కార్తీక సోమవారం, డిసెంబరు 7న నాలుగో కార్తీక సోమవారం వస్తాయి. డిసెంబరు 7న మాస శివరాత్రి, డిసెంబరు 8న కార్తీక అమావాస్యతో ఈ మాసం ముగియనుంది .
