గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
గ్రామాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలకు మెరుగైన పాలనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూరారం గ్రామంలో గ్రామపంచాయతీ భవనాన్ని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి కిషన్ లతో కలిసి ప్రారంభించారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్కటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించడం జరిగిందని, ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం తప్పనిసరిగా ఉండాలని, గ్రామ పంచాయతీ భవనంలో కార్యదర్శి గది, సర్పంచ్ గది, సమావేశ మందిరం వంటి సదుపాయాలు ఉండటం వల్ల గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామసభలు, ఇతర సమావేశాల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు 5.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, ఇప్పటికే పనులు చేపట్టిన వాటికి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం త్వరలో బిల్లుల చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, వి.ఓ. భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే సుమారు 20 భవనాల నిర్మాణం పూర్తయిందని, మరో 100 భవనాల నిర్మాణం వివిధ దశలలో ఉందని తెలిపారు. రానున్న 3, 4 నెలలలో 50 శాతం పనులు పూర్తి చేయడంతో పాటు, మిగిలిన పనులను వచ్చే సంవత్సరంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో రహదారులు, సి.సి. రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, గోదావరి పరివాహక ప్రాంతాలలో వ్యవసాయ అవసరాలకు సంబంధించిన రహదారులు, ఇతర సమస్యలను ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అంచనాలు రూపొందించి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. విద్య, వైద్య రంగాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని, లక్షెట్టిపేటలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అవసరమైన చోట్ల ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గ్రామాలలో విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాలలో కిలోమీటరు పరిధిలో విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంటే, అక్కడి నుంచి నూతన స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ కల్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు కొత్త విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం క్రింద రేషన్ కార్డు కలిగిన కుటుంబాలలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సంపాదించే సభ్యులకు 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పించేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులైన వారిని నమోదు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 10 వేల 360 మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల 50 వేల కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్లు మినహా మిగిలిన అర్హత కలిగిన కేటగిరీలకు కొత్త పెన్షన్లు అందించడం జరిగిందని, ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారికి కూడా నిబంధనల ప్రకారం పెన్షన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో అవసరమైన సి సి రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ పనులు, విద్యుత్ సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ల విషయంలో అర్హులైన వారు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారి వివరాలను పరిశీలించి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీకి సొంత భవనం నిర్మించుకోవడం అభినందనీయమని, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్‌ను అభినందించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మిగిలిన పనులను దశల వారీగా చేపట్టి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
