- ఢిల్లీ పోరుకు పటాన్‌చెరు కాంగ్రెస్ శ్రేణులు
పటాన్‌చెరు: ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటంలో భాగస్వాములయ్యేందుకు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ధర్నాలో వారు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణుల బస్సును పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయన సతీమణి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటా దంపతులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీహరి, నాగరాజు, సుధాకర్ గౌడ్, గోపాల్ యాదవ్, దేవదానం, బొడ్డు జగన్, ఉమెర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter