జిల్లాలో బ్యాంకింగ్ సేవలను విస్తరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణ సదుపాయాలు కల్పించాలి
- రైతులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో బ్యాంకింగ్ సేవలను విస్తరించి, బ్యాంకింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆర్థిక సేవలను చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ నటరాజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డి.ఓ శ్రీనివాస్ వెన్న, నాబార్డ్ డి.డి.ఎం. వీరభద్రుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రితేష్, ఎ.డి.సి.సి. సి.ఈ.ఓ. విశ్వేశ్వర్ లతో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా తలసరి ఆదాయం, పారిశ్రామిక రంగం, మైనింగ్ వంటి రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. బ్యాంకింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాలు, ప్రత్యేకించి పి.వి.టి.జి. జనాభా నివసించే ప్రాంతాలలో ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలో గుర్తించిన 135 ప్రాంతాలతో పాటు మరో 400కు పైగా ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవల విస్తరణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆర్థిక సమ్మిళిత బాధ్యతను స్వీకరించి సేవలను విస్తరించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగం నష్టపోయే అవకాశం ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కల్పించే అనుబంధ వ్యవసాయ రంగ కార్యకలాపాలను ప్రోత్సహించాలని తెలిపారు. రైతులకు మరింత అండగా బ్యాంకింగ్ సేవలు అందించాలని, కరువు పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ, అనుబంధ దీర్ఘకాలిక రుణాలను రీ షెడ్యూల్ చేసి రైతులకు అందించాలని, అవసరం ఉన్న రైతులకు అర్హతలను పరిశీలించి అదనపు రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు, ఇతర స్వల్పకాలిక రుణాలకు అర్హత కలిగిన రైతుల దరఖాస్తులను సానుకూల దృక్పథంతో పరిశీలించి రుణ సదుపాయాలు కల్పించాలని తెలిపారు. కరువు పరిస్థితుల కారణంగా రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఆర్.బి.ఐ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, సంబంధిత బ్యాంకుల మార్గదర్శకాల ప్రకారం స్వల్పకాలిక పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా పునర్వ్యవస్థీకరించే చర్యలు చేపట్టాలని సూచించారు. తద్వారా రైతులకు రుణ చెల్లింపులలో వెసులుబాటు కలిగి, తిరిగి ఆర్థికంగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రుణాల చెల్లింపులు, రీపేమెంట్ తదితర అంశాలలో సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత బ్యాంకర్లు, సెర్ప్, మెప్మా సిబ్బంది సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రుణాల వసూళ్లు, ఇతర సమస్యల విషయంలో ఇబ్బందులు ఎదురైతే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సహకారం అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. బ్యాంకులు ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు, మంచి క్రెడిట్ చరిత్ర కలిగిన వ్యక్తులు, కష్టపడి పనిచేసి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం ఉన్న సంస్థలకు రుణాలు అందించాలని సూచించారు. రుణ దరఖాస్తులను తిరస్కరించే సందర్భంలో స్పష్టమైన కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, తిరస్కరణకు గల కారణాలు తెలియజేస్తే వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగానికి అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యా రుణాలు, ఇతర అవసరాల కోసం రుణాలు కోరే విద్యార్థులు, అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్థులకు రుణ సదుపాయాలు కల్పించి వారి భవిష్యత్తుకు తోడ్పడాలని తెలిపారు. బ్యాంకులు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, వ్యాపార ప్రతినిధుల సేవలను కొనసాగించి మరింత పెంచాలని సూచించారు. బి.సి. కేంద్రాలను మూసివేయకుండా, బ్యాంకింగ్ సదుపాయాలు లేని ప్రాంతాలలో వాటి సంఖ్యను పెంచాలని తెలిపారు. జిల్లాలో కేవలం ఒకటి, రెండు శాఖలతోనే పరిమితమై వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తే ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యం కాదని, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు బ్యాంకులకు డిపాజిట్లు, ఇతర వ్యాపార అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలోని బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు, ఇతర వర్గాలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
