పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,అడిషనల్ డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్ పర్యవేక్షణలో, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యం,సామాజిక బాధ్యత,ప్రజాసేవ పట్ల నిబద్ధతను పెంపొందించడంతో పాటు ప్రజానుకూల పోలీసింగ్‌పై అవగాహన కల్పించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశం అని అధికారులు తెలిపారు.పోటీలను రెండు విభాగాలుగా నిర్వహించారు.పీసీ నుంచి ఏఎస్ఐ హోదా వరకు (సివిల్,ఏఆర్) సిబ్బందికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఎలాంటి సేవలను ఆశిస్తారు పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర ఏమిటి సోషల్ మీడియాకు బానిస కాకుండా వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాల కోసం దానిని సద్వినియోగం చేసుకోవడం ఎలా అదేవిధంగా,ఎస్ఐ/ఆర్ఎస్ఐ మరియు ఆపై హోదాల అధికారులకు పౌరుల నుంచి గౌరవం, ఆదరణ, సద్భావన పొందేందుకు పోలీసులు ఎలాంటి కృషి చేయాలి క్షేత్రస్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఎలా అనే అంశాలపై పోటి ఏర్పాటుచేశారు.
పోటీల్లో పాల్గొన్న సిబ్బంది తమ వ్యాసాలను తెలుగు లేదా ఆంగ్ల భాషలో రాసే అవకాశం కల్పించారు.
ఇలాంటి కార్యక్రమాలు పోలీసు సిబ్బందిలో ప్రజానుకూల దృక్పథం, జవాబుదారీతనం, వృత్తిపరమైన నిబద్ధతను పెంపొందించడంతో పాటు, పోలీసు విధులు, ప్రజల పట్ల బాధ్యతలు, సమర్థవంతమైన పోలీసింగ్‌పై మరింత అవగాహన కల్పించేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.
