రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం
- ప్రభుత్వం స్పందించకపోతే లక్ష మందితో హైదరాబాద్‌లో భారీ నిరసన
- పటాన్‌చెరు ఎమ్మెల్యే, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి
- గజ్వేల్‌లో ఘనంగా గౌరవ వేతన సాధన సభ.. నూతన రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం
మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గౌరవ వేతన సాధన సభ, నూతన రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుతో కలిసి గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, కరోనా వంటి మహమ్మారి సమయంలోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న డీలర్లు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు ఇచ్చిన ప్రధాన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలుకు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రేషన్ డీలర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వారి తరఫున నిరంతరం పోరాడతానని, వారి సంక్షేమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గౌరవ వేతన సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీలర్లను సమీకరించి హైదరాబాద్‌లో భారీ నిరసన చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, సంఘం ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన రేషన్ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
