ఇరిగేషన్ భూముల ఆక్రమణలను సహించేది లేదు
- ధర్మసాగర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలు.. అక్రమ లేఅవుట్ ఫెన్సింగ్ గోడ కూల్చివేత
మంగళవారం నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువు ఎఫ్‌టీఎల్ (పూర్తి నీటిమట్టం) పరిధిలో చేపట్టిన ఆక్రమణలను కలెక్టర్ పరిశీలించారు. చెరువుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు, సంబంధిత మ్యాపులను పరిశీలించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసేందుకు చేపట్టిన నిర్మాణాలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు.
ధర్మసాగర్ చెరువు పరిధిలో అనధికారికంగా నిర్మించిన లేఅవుట్ ఫెన్సింగ్ గోడను అధికారులు కూల్చివేశారు. వెంచర్ నిర్మాణ పనులకు వినియోగిస్తున్న యంత్రాలు, సామగ్రి, ఇసుక తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని నీటిపారుదల శాఖ భూములు, చెరువుల పరిధిలో ఆక్రమణలను అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆక్రమణలను గుర్తించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, తహశీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
