అధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి
- ఒక కుటుంబానికి నెలకు 26 కిలోలతో ఒక బియ్యం బస్తా మాత్రమే
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి బియ్యం విక్రయాలు జరిపేందుకు వీలుగా గజానన్ రైస్ మిల్ ఇండస్ట్రీ వారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీ గంజ్ కమాన్ గోశాల రోడ్ కు ఆనుకుని ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. బీ.పీ.టీ, హెచ్.ఎం.టీ తదితర రకాల బియ్యంను ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే మరికొంత తక్కువ ధరకే విక్రయాలు జరిపేలా ముందుకు రావడం పట్ల కలెక్టర్ గజానన్ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని అభినందించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ నిర్ణీత ధరకే విక్రయాలు జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన జరిపేందుకు వీలుగా రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని సూచించారు. నిర్ణీత ధరల కంటే అధిక రేట్లకు విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ వెల్లడించారు. కాగా, 26 కిలోల బరువుతో కూడిన ప్రీమియం క్వాలిటీ బీ.పీ.టీ స్టీమ్ రైస్ బ్యాగ్ ను రూ.1510 లకు, హెచ్.ఎం.టీ రకం బియ్యం బస్తా రూ. 2030 చొప్పున అవుట్ లెట్ ద్వారా విక్రయాలు జరుపుతామని గజానన్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు హితెన్ భిమాని తెలిపారు. ఆధార్ కార్డును పరిశీలిస్తూ ఒక కుటుంబానికి నెలకు 26 కిలోలతో కూడిన ఒక బియ్యం బస్తా మాత్రమే విక్రయించేలా ఏర్పాట్లు చేశామని, దీనివల్ల ఏకమొత్తంలో కొనుగోళ్లకు ఆస్కారం లేకుండా అందరికీ నిర్ణీత ధరకు బియ్యం అందాలనే సదుద్దేశ్యంతో ఆధార్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమల్ కిషోర్, ప్రియాన్ భిమాని, రవీష్ తదితరులు పాల్గొన్నారు.
