మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులకు రూ. 42 కోట్లు కేటాయించామని వెల్లడి
- యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు హితవు
- అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 29 : ఎల్ నినో ప్రభావంతో విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. వచ్చే వేసవి సీజన్ ముగిసే వరకు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి హాబిటేషన్ కు రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా ముందస్తుగానే సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నామని అన్నారు. తీవ్ర వర్షాభావం, భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్న దృష్ట్యా రబీలో వరి పంటకు సాగు నీరు అందించే పరిస్థితి లేనందున వరి వేయవద్దని రైతులకు హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం కలెక్టర్ ఇలా త్రిపాతితో కలిసి మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ఆర్.డబ్ల్యూ.ఎస్, గ్రౌండ్ వాటర్, వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం, యాసంగి పంటల సాగు, ఆర్ఓబీ ల నిర్మాణ పనుల పురోగతి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల పనులు, నిజామాబాద్ కార్పొరేషన్ సహా బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ పట్టణాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి వారికి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాన తాగునీటి వనరులుగా ఉపయోగపడుతున్న నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పూర్తిగా తాగు నీటి అవసరాల కోసమే వినియోగించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు యాసంగిలో తక్కువ నీటి అవసరం ఉండే కూరగాయలు, పప్పు దినుసులు వంటి పంటలు విత్తుకోవాలని కోరారు. ఆరుతడి పంటలకు కూడా అవసరం మేరకే సాగు నీరు వినియోగించుకునేందుకు వీలుగా రైతుల ప్రయోజనాల కోసం అన్ని మండలాలకు సబ్సిడీపై రెయిన్ గన్స్ మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఒక్కో యూనిట్ ధర 24 వేలు ఉండగా, అందులో 8 వేలు చెల్లిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రాయితీ కింద భరిస్తుందని తెలిపారు. కాగా, మూగజీవాలకు కూడా పశుగ్రాసం కొరత, నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చోట నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని, పశుగ్రాసం విత్తనాలు సబ్సిడీపై అందించాలని అధికారులకు సూచించారు.
జలాశయాలలో నిలువ ఉన్న నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకు ఉపయోగించేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. అవసరమైన చోట పైప్ లైన్ల మరమ్మతులు చేపట్టి లీకేజీలు లేకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరాకు ఉపయోగపడుతున్న చెరువులను పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా బోర్లు తవ్వించకుండా, వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. మున్సిపల్ పట్టణాలలో కొనసాగుతున్న మంచి నీటి ట్యాంకుల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని సూచించారు. అవసరమైతే కూలీల సంఖ్యను పెంచాలని అన్నారు. యంచ వద్ద గల న్యాల్కల్ పంప్ హౌజ్ ద్వారా నిర్దేశిత గ్రామాలకు రక్షిత మంచి నీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా చుక్క నీరు వృధా కాకూడదని, అదే సమయంలో ఎక్కడైనా దాహార్తి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
*ఆర్.ఓ.బీ ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి*
ఇదిలాఉండగా, మాధవనగర్, అర్సపల్లి ప్రాంతాలలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మాధవనగర్ ఆర్ఓబీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 13 విడతలలో రూ. 42 కోట్ల నిధులు కేటాయించిందని వివరించారు. అర్సపల్లి ఆర్ఓబీ కి కూడా రూ. 11 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. అయినప్పటికీ కొంత మంది నాయకులు అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సౌకర్యార్థం ఆర్ఓబీ ల నిర్మాణాలను నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు గడువు విధించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఎక్కడ కూడా నీటి వృధా జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, రక్షిత నీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో నీటి పొదుపుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లైస్ అధికారులు ప్రవీణ్, అరవింద్ రెడ్డి, మిషన్ భగీరథ అధికారులు స్వప్న, రాకేష్, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ తిరుపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
