- 97.41 శాతం మంది విద్యార్థుల హాజరు.. ఐదు పరీక్ష కేంద్రాల్లో సజావుగా నిర్వహణ
నిర్మల్ జిల్లాలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో మొత్తం హాజరు శాతం 97.41గా నమోదైనట్లు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తం 889 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 866 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో 23 మంది గైర్హాజరయ్యారు.పరీక్ష కేంద్రాల వారీగా హాజరు వివరాలు పరిశీలిస్తే.. భైంసా ఉన్నత పాఠశాలలో 146 మందికి గాను 138 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భైంసాలో 143 మందికి గాను 143 మంది, జుమ్మెరత్పేట్ పాఠశాలలో 173 మందికి గాను 170 మంది, సోమవార్‌పేట్ బాలికల ఉన్నత పాఠశాలలో 173 మందికి గాను 171 మంది, ఖానాపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 254 మందికి గాను 244 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున పంచాయతీరాజ్ శాఖకు చెందిన కార్యదర్శులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పాటు సెంటర్ లెవల్ అబ్జర్వర్లను నియమించి పర్యవేక్షణ చేపట్టారు.
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి కేంద్రంలో పోలీసు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.
జిల్లా వ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer