వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవగాహనకు వాక్‌థాన్
- వేధ హాస్పిటల్ ఆధ్వర్యంలో కార్యక్రమం.. ప్రారంభించిన బీఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్
ఈ వాక్‌థాన్ శ్రీ వేధ హాస్పిటల్ నుంచి ప్రారంభమై బీరంగూడ గుట్ట కమాన్ వరకు కొనసాగింది. అక్కడి నుంచి తిరిగి ఆసుపత్రికి చేరుకోవడంతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, పక్షవాతం (స్ట్రోక్) లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యాధి నివారణకు అవసరమైన జాగ్రత్తలు తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలని సూచించారు. సమయానికి చికిత్స అందితే ప్రాణాపాయం, దీర్ఘకాలిక వైకల్యం ముప్పును తగ్గించవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా పరమేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, వైద్యులు సూచించే జాగ్రత్తలను పాటించాలని కోరారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు శ్రీ వేధ హాస్పిటల్ చేపట్టిన వాక్‌థాన్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి డా. అరవింద్ రెడ్డి, డా. నరేష్, తంట కృష్ణ కాంత్, పలువురు వైద్యులు, హాస్పత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
