📅 Wednesday, 04 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య
‹
›
District News

బాసర ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థిని జక్కా శ్రావణికి ఘన సత్కారం

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
బాసర ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థిని జక్కా శ్రావణికి ఘన సత్కారం
  • డెలాయిట్ యూకేలో ఉన్నత స్థాయికి ఎదిగిన శ్రావణితో విద్యార్థుల ముఖాముఖి.. ‘ఆమె కథ’ పుస్తకావిష్కరణ
నిర్మల్ నవంబర్ 4 (సాక్షర ప్రతినిధి)
బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో పూర్వ విద్యార్థిని జక్కా శ్రావణితో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. విశ్వవిద్యాలయ అల్యూమ్ని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రావణి విజయ ప్రస్థానంపై రచయిత్రి రోజ రచించిన ‘ఆమె కథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ కష్టపడి చదువుకునే విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరంతర కృషి, పట్టుదలతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. బాసర విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.అనంతరం జక్కా శ్రావణి తన విజయ ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేసిన అనంతరం మూడేళ్లపాటు ఐబీఎం సంస్థలో పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని డీ మోంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసి, యూకేకు వెళ్లిన 40 రోజుల్లోనే మూడు ఉద్యోగావకాశాలు పొందినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి సంస్థ డెలాయిట్ యూకేలో పనిచేస్తున్నట్లు వివరించారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా 7 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించడంతో పాటు విశ్వవిద్యాలయ అల్యూమ్ని అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకున్న రోజుల్లో ఎదురైన సమస్యలు, అనుభవాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ట్రిపుల్ ఐటీ విద్యాభ్యాసమే పునాదిగా నిలిచిందన్నారు. మార్కులు మాత్రమే విజయానికి కొలమానం కాదని, కృతజ్ఞతా భావం, స్నేహపూర్వక వైఖరి, మంచి వ్యక్తులతో పరిచయాలు, నిరంతర అభ్యాసం జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడతాయని సూచించారు. ప్రస్తుత విద్యార్థులు క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్. విఠల్, సీఓఈ డాక్టర్ జి. దేవరాజు, అల్యూమ్ని అఫైర్స్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ స్వప్నిల్, సీఎస్ఆర్ ఫండింగ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ జి. శంకర్, డాక్టర్ ఎస్. శ్రావణ్, మండ సతీశ్, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.