బండి సంజయ్వి బజారు మాటలు.. మతిభ్రమించి మాట్లాడుతున్నారు.
- కేంద్ర మంత్రి హోదాలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలా? బీజేపీ నేతల తీరుపై ఎంబడి రాజేశ్వర్ ఘాటు విమర్శలు.......
కేంద్ర మంత్రి హోదాలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బండి సంజయ్ బజారు భాషతో రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. నిర్మల్లో నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్ర ముగింపు సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కేంద్ర మంత్రి ఉపయోగించిన పదజాలం ఆయన అసహనానికి, సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు.
హైదరాబాద్లో జరిగిన సభలో నాయకుల మధ్య చోటుచేసుకున్న తొక్కిసలాటలో బండి సంజయ్ పరుగులు తీయడాన్ని ప్రస్తావిస్తూ, ఆ ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల ఓటు హక్కులకు నష్టం కలిగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందని, దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దివంగత నేతలు పీవీ నరసింహారావు, ఎంఎస్ఆర్ పేర్లను రాజకీయ వివాదాల్లోకి లాగుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదని రాజేశ్వర్ అన్నారు.దేశ సమగ్రత, భద్రత కోసం సేవలందించిన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల త్యాగాల చరిత్ర కలిగిన గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు బండి సంజయ్కు లేదని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజా పాలన ద్వారా రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రావణుడితో పోల్చడం బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. మత విద్వేషాలు, విభజన రాజకీయాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ నేతలే ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
నిర్మల్ జిల్లా సర్వమత సామరస్యానికి ప్రతీక అని, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించబోరని ఎంబడి రాజేశ్వర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ నిర్మల్ జిల్లాకు,తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ విఫలమయ్యారని విమర్శించారు. అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
