ప్రజావాణిలో ప్రజల సమస్యలను స్వయంగా విన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల
- ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండాలి – బాధితులకు సకాలంలో న్యాయం అందించాలి.. అధికారులకు ఎస్పీ ఆదేశం
ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజావాణిలో అందే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వింటూ, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం, అనవసర జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే ప్రజావాణి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన సేవల ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు.
