ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి
- పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి.. అధికారులకు అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు ఆదేశం
నిర్మల్, నవంబర్ 23, సాక్షర ప్రతినిధి:
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి దరఖాస్తుపై తక్షణమే స్పందించాలని సూచించారు.
సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు వారికి తగిన స్పందన అందించాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించి తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు, డీఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
