📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శలు.. అధికారులతో కలిసి నాలుగు గంటల పాటు మార్నింగ్ వాక్

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శలు.. అధికారులతో కలిసి నాలుగు గంటల పాటు మార్నింగ్ వాక్
  • పటాన్‌చెరు అభివృద్ధికి నోచుకోవడం లేదు
  • దోషం చెరువు స్థలాన్ని కాపాడాలని హైడ్రా కమిషనర్‌కు ఫోన్.. వారంలోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
రాష్ట్రంలోనే కీలకమైన పారిశ్రామిక, రెవెన్యూ కేంద్రంగా ఉన్న పటాన్‌చెరు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శించారు. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా ప్రాంతం తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పటాన్‌చెరు పరిధిలో అధికారులతో కలిసి సుమారు నాలుగు గంటల పాటు మార్నింగ్ వాక్ నిర్వహించి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన లక్షలాది మందితో మినీ ఇండియాగా పేరుగాంచిన పటాన్‌చెరులో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంజిరెడ్డి అన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమై ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పర విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగడం లేదని మండిపడ్డారు.
ప్రధాన రహదారులు, కాలనీల్లోని అంతర్గత రోడ్లపై చెత్త పేరుకుపోవడం, మురుగునీరు నిలిచిపోవడం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని తెలిపారు. నివాస ప్రాంతాల్లోకి మురుగునీరు చేరుతున్నా అధికారులు స్పందించడం లేదని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, కొత్త ఆసుపత్రిని ప్రారంభించడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస వసతులు, మరుగుదొడ్లు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నేతాజీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకులు లేక పిల్లల సంరక్షణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
కాలనీల్లో వీధి దీపాలు సరిగా వెలగక రాత్రివేళ మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.
బండ్లగూడ గోపాల్‌రెడ్డి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఎమ్మెల్సీకి వివరించారు. అదే కాలనీకి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు మొగులయ్యకు అర్హత ఉన్నప్పటికీ వృద్ధాప్య పింఛన్ మంజూరు కాలేదని తన ఆవేదనను వ్యక్తం చేశారు. దోషం చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని, పందుల బెడదను నివారించాలని ప్రజలు కోరారు. 2022లో చెరువు అభివృద్ధి కోసం డ్రైనేజీ పైప్‌లైన్, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ.1.15 కోట్లు మంజూరైనా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ దోషం చెరువు చుట్టూ ఉన్న సుమారు 16 ఎకరాల స్థలం ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. శాంతినగర్‌లో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, అక్కడి స్మశానవాటిక స్థలం కబ్జాలకు గురికాకుండా సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలని తహసీల్దార్‌ను కోరినట్లు చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితం కాకుండా అర్హులైన పేదలందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా అందాలని అన్నారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. మార్నింగ్ వాక్ సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ రాబోయే వారంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
పార్టీలకు అతీతంగా పటాన్‌చెరు ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అంజిరెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.