చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె
- 23వ రోజు సమ్మెలో భాగంగా వీరనారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు.. ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తమ హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎన్‌హెచ్‌ఎం (NHM) ఉద్యోగులు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె బుధవారం 23వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌ఎం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌తో పాటు 8 శాతం లాయల్టీ బోనస్‌ను తక్షణమే చెల్లించాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించి ఉద్యోగులను రెగ్యులర్ చేసే వరకు సమ్మెను విరమించేది లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు గంగాధర్, జిల్లా కోఆర్డినేటర్ రమణ, జేఏసీ నాయకులు డా. రమేష్, డా. అలీ, డా. శ్రీమంత్, డా. సన్నిత్, డా. రానా ప్రతాప్, డా. సంధ్యారాణి, వినీత, వంశీ, సుజాత, రాధ, శోభ, గంగమణి, జైపాల్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
