కడ్తాల్ లో మోటార్ కేబుల్ వైర్ల చోరీ ..
- ఇద్దరు నిందితులు అరెస్ట్ పొలంలో కేబుల్ వైర్లు దొంగిలిస్తుండగా పట్టుకున్న గ్రామస్తులు.. పోలీసులకు అప్పగింత
కడ్తాల్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో మోటార్ కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకొని సోన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన న్యూ బొప్పారం కుంచపు లక్ష్మణ్ (23), తండ్రి ఎల్లయ్య, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కూలీ, అలాగే గుపాల్వాడ్ శ్రీనివాస్ (26), తండ్రి హనుమంతు, నాయకపోడ్ సామాజిక వర్గానికి చెందిన కూలీ ఇద్దరూ గతంలో పలు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలో నవంబర్ 3న కడ్తాల్ గ్రామ శివారులోని సరస్వతి కెనాల్ వద్ద రైతులు వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసుకున్న కేబుల్ వైర్లను దొంగిలిస్తుండగా పొలం యజమాని గుర్రం లింగన్న గమనించారు. వెంటనే పక్క పొలాల్లో ఉన్న మరో ఇద్దరు రైతుల సహాయంతో వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై సోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామాల్లో వ్యవసాయ మోటార్లు, కేబుల్ వైర్ల చోరీల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
