- జాతీయ స్థాయి పోటీలకు ఐదుగురు విద్యార్థుల ఎంపిక
పటాన్‌చెరు: విశాఖపట్నంలోని గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన 5వ కేఐఓ సౌత్ జోన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో పతకాలు సాధించిన విద్యార్థులను పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. సింధు ఆదర్శ్ రెడ్డి అభినందించారు. మాస్టర్ జి. అగస్టిన్ ఆధ్వర్యంలోని సెరియోకు షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీకి చెందిన విద్యార్థులు మర్యాదపూర్వకంగా వారిని కలిశారు. ఈ సందర్భంగా పోటీల్లో విద్యార్థులు సాధించిన విజయాలను నాయకులు అభినందించారు. వివరాల్లోకి వెళితే.. జి. విహాన్ కుమిటే విభాగంలో స్వర్ణ పతకం, కటా విభాగంలో రజత పతకం సాధించారు. జి. రిత్విక్ కుమిటేలో స్వర్ణ పతకం, కటాలో కాంస్య పతకం గెలుచుకున్నారు. వై. తన్వి రెడ్డి కుమిటేలో రజత పతకం సాధించగా, సయ్యద్ మహమ్మద్ తాహా, హెచ్. ఆద్య శ్రీ కటా విభాగంలో కాంస్య పతకాలు సాధించి ప్రతిభ చాటారు.
ఈ ఐదుగురు విద్యార్థులు డిసెంబర్ 16, 17 తేదీల్లో ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక కావడం పట్ల ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి, పటాన్‌చెరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు శిక్షణ అందించి, వారి విజయాలకు కృషి చేసిన మాస్టర్ జి. అగస్టిన్‌ను కూడా నాయకులు అభినందించారు.
— Vukkalkar VivekStaff Reporter