బాసర ట్రిపుల్ ఐటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
- విద్యార్థులకు నిరంతరం శుద్ధి చేసిన సురక్షిత తాగునీరు అందించాలి.. అధికారులకు కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశం
బుధవారం బాసర ఐఐఐటీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, క్యాంపస్‌లో నీటి సరఫరా సమస్యలు, ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తాగునీటి నాణ్యతను పరీక్షించి, శుద్ధి చేసిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలని సూచించారు. నీరు ఎక్కడ కలుషితమవుతుందో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు సరిపడా నీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యార్థులు తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళి దర్శన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
