భైంసా సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2040 నాటి అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక
- ముసాయిదాపై సూచనలు, అభ్యంతరాలు తెలియజేయాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
2040 లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధి
ప్రస్తుతం భైంసా పట్టణ జనాభా సుమారు 60 వేల వరకు ఉందని, భవిష్యత్‌లో జనాభా మరింత పెరిగే అవకాశముందని కలెక్టర్ వివరించారు. ఈ నేపథ్యంలో 2040 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాంతాలను క్రమబద్ధంగా విభజించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా మాస్టర్ ప్లాన్ ఉండాలని పేర్కొన్నారు.
అందరి సూచనలతో ప్రణాళిక అమలు
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, భైంసా పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఎంతో అవసరమని అన్నారు. ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ముసాయిదాపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
మాస్టర్ ప్లాన్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అశ్విని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముసాయిదా మాస్టర్ ప్లాన్ వివరాలను వెల్లడించారు. పారిశ్రామిక, వాణిజ్య, నివాస జోన్లకు సంబంధించిన పటాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ కుతిజా సిద్దికీ, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
