- గీతం సెమినార్‌లో డాక్టర్ ఫర్హాన్ అహ్మద్
హైదరాబాద్: నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల నివారణకు శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, సామాజిక పరిశోధకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, జీవశాస్త్రాల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫర్హాన్ అహ్మద్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్‌హెచ్‌ఎస్), హైదరాబాద్‌కు చెందిన సంస్థాగత పరిశోధన కమిటీ ఆధ్వర్యంలో పరిశోధన సదస్సుల శ్రేణిలో భాగంగా ఎనిమిదో సెమినార్‌ను బుధవారం నిర్వహించారు. ‘వేడెక్కుతున్న ప్రపంచం కోసం వ్యాక్సిన్ల రూపకల్పన: డెంగ్యూపై పోరాటంలో విజ్ఞానం, సమానత్వం, విధానం’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఫర్హాన్ అహ్మద్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు డెంగ్యూ వ్యాప్తిపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తమ పరిశోధనా ప్రయోగశాలలో చేపట్టిన వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను వివరించారు. తమ పరిశోధనలు ప్రస్తుతం ప్రాథమిక, ప్రీ-క్లినికల్ దశల్లో ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ భద్రత, సమర్థతకు సంబంధించి ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను మెరుగైన రూపకల్పన ద్వారా అధిగమించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు అధ్యాపకులు చర్చలో చురుగ్గా పాల్గొని, వివిధ అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. డాక్టర్ ఫర్హాన్ అహ్మద్ పరిశోధనా నైపుణ్యాన్ని, అంశాలను స్పష్టంగా వివరించిన తీరును వారు అభినందించారు.
— Vukkalkar VivekStaff Reporter