భూ పరిపాలనకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్
రాష్ట్రంలోని భూ పరిపాలనకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో భూ పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విజిలెన్స్ కేసులు, భూదాన్ భూములకు సంబంధించిన నివేదికలు, భూముల రీసర్వే పురోగతి, హైకోర్టు కేసులు, భూ భారతి పెండింగ్ దరఖాస్తులు (పాతవి, కొత్తవి), భూసేకరణ, జి.ఓ. నెం.59, 76, 118, యూ ఎల్ సి భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి ప్రతి అంశానికి సంబంధించిన తాజా వివరాలు, పెండింగ్ కేసుల స్థితిగతులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యు ఎల్ సి భూములు, జి.ఓ. 59, 76, 118 క్రింద పెండింగ్లో ఉన్న క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించి సంబంధిత దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని తెలిపారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి, రికార్డులను అనుసరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన కేసుల పురోగతి వేగవంతం చేయాలని, భూ పరిపాలనకు సంబంధించిన పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రికార్డులను సక్రమంగా నిర్వహించి, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు మాట్లాడుతూ భూభారతి పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని, జి.ఓ. నం. 59, 76, 118 క్రింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, కేసుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత రికార్డులు, నివేదికలను ఎప్పటికప్పుడు నవీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్పాండే, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
